29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలి

 

. . . అదనపు కలెక్టర్ భుజంగరావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రైవేటుగా ఆరోగ్య సేవలు అందించే ప్రతి ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అదనపు కలెక్టర్ భుజంగరావు అధ్యక్షత వహించగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఏ విభాగానికి చెందిన ప్రైవేట్ ఆసుపత్రులైనా రిజిస్ట్రేషన్ లేకుండా సేవలు అందించరాదన్నారు. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే నిబంధనలు, అర్హతలను పరిశీలించి మొదట ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తామని తెలిపారు. అనంతరం ఒక సంవత్సరం తర్వాత అర్హతలు ఉన్న ఆసుపత్రులకు ఐదు సంవత్సరాల కాలపరిమితితో శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని, అలాగే సేవా చార్జీలు, టారిఫ్ వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. కమిషన్ల కోసం ఆర్ఎంపీ, పీఎంపీల ద్వారా అక్రమ రిఫరల్ వ్యవస్థను కొనసాగించే ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత కలిగిన వైద్యులు, సిబ్బంది మాత్రమే ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాలని, అనర్హులు వైద్య సేవలు అందించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నిజామాబాద్ పేరుతో డీడీ రూపంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలోని పడకల సంఖ్య, ప్రాంతాన్ని బట్టి మెట్రో, అర్బన్, రూరల్ విభాగాల ప్రకారం ఫీజు నిర్ణయించబడుతుందని వివరించారు. దరఖాస్తుల అనంతరం డిజిగ్నేటెడ్ ఇన్‌స్పెక్షన్ అధికారి చెక్లిస్ట్ ఆధారంగా ఆసుపత్రి నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా పరిశీలించిన తర్వాతే ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగానికి సహకరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ విద్య, డాక్టర్ రవీందర్, డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శిఖర్, బోధన్ ఐఎంఏ అధ్యక్షుడు మకరంద్, కార్యదర్శి నాగనాథ్, డిప్యూటీ డెమో దుర్గారావు, వేణుగోపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Registration and renewal are mandatory for private hospitals.

More articles

Latest article