28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాల్య వివాహం – బతుకు ఆగం పై రాష్ట్రవ్యాప్త పోరు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తరుణి స్వచ్ఛంద సంస్థ తో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాల్య వివాహం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, అది బాలికల భవిష్యత్తును ప్రభావితం చేసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. బాల్య వివాహాల కారణంగా బాలికల విద్య మధ్యలోనే ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆర్థిక స్వావలంబన దెబ్బతినడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. బాల్య వివాహం – బతుకు ఆగం అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా కేంద్రంగా ఈ ప్రచారం మరింత విస్తృతంగా జరగాలన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఇప్పుడు తరుణి వంటి అనుభవజ్ఞ సంస్థ సహకారంతో ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సీడీపీవోలు, ఇతర శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచార కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మైనర్ గర్భధారణల ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, “ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించడం మనందరి బాధ్యత. బాల్య వివాహాలకు పూర్తిగా ముగింపు పలకడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తరుణి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మమతా రఘువీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల తగ్గింపునకు సాంకేతిక సహకారం, అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఒఝా, తరుణీ ఫౌండర్స్ మమతా రఘువీర్, రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.

 

Statewide campaign against child marriage and the ruin of lives.

More articles

Latest article