జుక్కల్, బతుకమ్మ: నిజాంసాగర్ జూనియర్ కళాశాల గురువారం ఉదయం 10.30 గంటలు దాటినా తెరుచుకోలేదు. కళాశాల తాళం తీసేవారు లేకుండాపోయారు. అధ్యాపకులతోపాటు విద్యార్థులూ రాలేదు. 21 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం జూనియర్ కళాశాలను ప్రారంభించారు. మొన్నటి వరకు లెక్చరర్ల నియామకం లేకపోవడంతో పిట్లం జూనియర్ కళాశాల నుంచి లెక్చరర్లు వచ్చి ఒకటి రెండు తరగతులు అప్పుడప్పుడు నిర్వహించేవారు. లెక్చరర్లు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. తెలియకపోవడంతో విద్యార్థులు సైతం కళాశాలకు అప్పుడప్పుడు వచ్చేవారు. గత పది రోజుల క్రితం నిజాంసాగర్ జూనియర్ కళాశాలకు ఓ లెక్చరర్‌ను నియమించారు. అయితే గురువారం ఉదయం 10.30గంటలైనా ఆ లెక్చరర్ సైతం కళాశాలకు రాకపోవడంతో తాళాలు తీయలేదు. ఎలాగూ లెక్చరర్లు రావడంలేదని విద్యార్థులు సైతం కళాశాలకు రావడం మానేశారు. పుస్తకాలు ఇప్పటి వరకు అందజేయలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి నిజాంసాగర్ కళాశాలను గాడిలో పెట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
