. . . కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ :
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. ప్రజోపయోగ పరిపాలనలో భాగంగా గ్రామస్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, సూచనలు, స్థానిక అభివృద్ధి అవసరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలలో దశలవారీగా ప్రత్యేక గ్రామసభల నిర్వహణను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మురుగునీటి కాలువల శుభ్రత, కలుపు మొక్కల తొలగింపు, తాగునీటి వనరులు, నీటి నిల్వ ట్యాంకుల నిర్వహణ, వీధి దీపాల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు, గ్రామస్థులకు సూచించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు గ్రామాలలో పరిశుభ్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీలు ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి–2026 ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తడి వ్యర్థాలను ఆకుపచ్చ డబ్బాల్లో, పొడి వ్యర్థాలను నీలి డబ్బాల్లో, పారిశుధ్య వ్యర్థాలను ఎరుపు డబ్బాల్లో, ప్రత్యేక వ్యర్థాలను నలుపు డబ్బాల్లో వేరు చేసి, శాస్త్రీయ పద్ధతిలో పారవేయడానికి గ్రామ పంచాయతీలకు అప్పగించాలని ప్రజలకు సూచించారు. గ్రామసభలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సేకరణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు సంసిద్ధత, పంటల వైవిధ్యీకరణ, బడి బాట కార్యక్రమం ద్వారా పాఠశాల నమోదు, అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక గ్రామసభల ద్వారా గ్రామీణ సమస్యలను గుర్తించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యమని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

