. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి
నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితమని ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. మండలంలోని బంజారా తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం 8 బెంచీలను ఆయన అందజేశారు. మాజీ ఎంపీపీ దివీటి రాజ్ దాస్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పటికీ తాను పుట్టిన ప్రాంత ప్రజలకు నిరంతరం సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధనను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజ్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ మూర్తి, బీజేపీ నాయకులు మేకల హన్మాండ్లు, దేవీసింగ్, కిషన్, రాజు తదితరులు ఉన్నారు.

