30.9 C
Hyderabad
Monday, August 3, 2026

డిగ్రీతో పాటు జాబ్ ఆఫర్ లెటర్‌కు అవకాశం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏఈడీపీ ప్రత్యేక కోర్సులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్థులకు డిగ్రీ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోర్సులను నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. కళాశాలలో బీకాం విభాగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్ఎస్ఐ), సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు ఉపాధి అనుభవాన్ని అందిస్తాయని తెలిపారు.

. . . అప్రెంటిస్‌షిప్‌తో ఉద్యోగ నైపుణ్యాల పెంపు

ఏఈడీపీ విధానంలో విద్యార్థులు డిగ్రీ చదువుతో పాటు వివిధ పరిశ్రమలు, సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతారు. దీని ద్వారా ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, వృత్తిపరమైన అనుభవం పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. కోర్సు పూర్తయ్యే సమయానికి విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు పరిశ్రమల్లో పనిచేసిన అనుభవాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఐదవ సెమిస్టర్లో నిర్వహించే ఆరు నెలల అప్రెంటిస్‌షిప్ సమయంలో నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 వరకు స్టైఫండ్ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంబంధిత సంస్థల నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు పొందే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

. . . మూడు ప్రత్యేక ఉపాధి ఆధారిత కోర్సులు

బి.కాం (బిఎఫ్ఎస్ఐ): బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్యాలతో పాటు పెయిడ్ అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు, డిజిటల్ బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

బిఎస్సీ (హెల్త్ కేర్ మేనేజ్మెంట్): ఆసుపత్రులు, క్లినిక్స్ మరియు ఆరోగ్య సేవల సంస్థల నిర్వహణకు సంబంధించిన శిక్షణ అందించబడుతుంది. విద్యార్థులు ఆరు నెలల పాటు హాస్పిటల్స్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. కోర్సు అనంతరం ఆసుపత్రుల నిర్వహణ, వైద్య నిర్ధారణ కేంద్రాలు, ఆరోగ్య బీమా సంస్థలు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి.

బిఎస్సీ (డిజిటల్ ఎలక్ట్రానిక్స్): ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ, హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, డిజిటల్ సిస్టమ్స్ రంగాల్లో పరిశ్రమల అనుభవంతో కూడిన శిక్షణ అందించబడుతుంది. ఈ కోర్సు ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తాయి.

. . . ఈ నెల 15 వరకు అడ్మిషన్లు

దోస్త్ మూడో దశ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 15వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఏఈడీపీ కోర్సుల సమన్వయకర్త డాక్టర్ కే. రంజిత తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి ఆధారిత ఏఈడీపీ కోర్సుల్లో చేరి తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆమె సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం విద్యార్థులు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్‌ను సంప్రదించాలని కోరారు.

More articles

Latest article