24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

. . . కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు

కొమురం భీం – ఆసిఫాబాద్, బతుకమ్మ :

 

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రోత్సాహం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురం భీం–ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించి మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా చింతలమానేపల్లి మండలంలోని కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.56.55 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అలాగే రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగంగా నిలుస్తోంది. చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులకు, అలాగే కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మరింత వేగంగా ఇళ్ల మంజూరు చేపడతామని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, త్వరలో మరిన్ని గృహప్రవేశాలు జరగనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో ఆదివాసీ ప్రాంతాలు అనేక రకాలుగా వెనుకబడ్డాయని, వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. జిల్లాలో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ప్రాంతీయ పురోగతికి కొత్త దిశను చూపుతాయని అధికారులు పేర్కొన్నారు.

More articles

Latest article