నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 32 ఫిర్యాదులను స్వీకరించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులను స్వయంగా విన్న కమిషనర్, వాటిని చట్టబద్ధంగా పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, తక్షణ చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు, పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని, వారి సమస్యలు చట్టప్రకారం పరిష్కారం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావడం, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

