ఏర్గట్ల, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల కార్యక్రమంలో కిశోర బాలికలల మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా మండలం లో ఐకెపి ఆధ్వర్యంలో 16 కిషోర బాలిక సంఘాలు ఏర్పాటు చేయగా అందులోంచి నూనె శ్రీనిధి, అశ్విని, సుహానా పర్వీన్ లను మార్క్ పార్లమెంట్ కార్యక్రమానికి ఎంపిక చేసి పంపించినట్లు ఐకెపి మండల ఏపిఎం కుంట గంగాధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ హోదాలో పాల్గొన్న నూనె శ్రీనిధి తన అద్భుతమైన ప్రదర్శనతో రాబోయే రోజులలో బాలికలు ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, తనకు తాను ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై చాలా చక్కగా మాట్లాడిందన్నారు. ఆడపిల్లలకు ఎలాంటి అవకాశాలు కల్పించాలో తెలిపిన ఆ ప్రసంగం అందరిని ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డి ఆర్ డి ఏ జిల్లా పిడి సాయన్నలు, శ్రీనిధి మాట్లాడిన విధానానికి ఎంతో ముగ్ధురాలై ఆమెను ప్రత్యేకంగా పిలిచి ప్రశంసించారని, త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే కిశోర బాలికల మాక్ పార్లమెంట్ లో నూనె శ్రీనిధికి అవకాశం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి తో పాటు ఏర్గట్ల గ్రామానికి చెందిన అశ్విని, సుహాన పర్వీన్ లు మహిళా సంక్షేమ శాఖ మంత్రి, ఎమ్మెల్యే పాత్రలో పాల్గొన్నారు. చక్కని ప్రతిభను కనబరిచిన నూనె శ్రీనిధి ని ఏర్గట్ల ఐకెపి ఎపీఎం కుంట గంగాధర్, సీసీ రవి కుమార్, మహిళా సంఘాల సభ్యులు అభినందించారు.

