. . . భార్యతో పాటు హత్యకి సహకరించిన సహచరుల అరెస్ట్
. . . సంచలన కేసును చేధించిన నారాయణఖేడ్ పోలీసులు
సంగారెడ్డి, బతుకమ్మ :
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సంచలనానికి గురిచేసిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడు, అతని అన్నతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నారాయణఖేడ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, గంగాపూర్ గ్రామానికి చెందిన శంబనోల్లా ముత్యం రెడ్డి (35) బోర్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 16వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోవడంతో, మే 18న అతని భార్య శంబనోల్లా కల్పన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు క్రైమ్ నంబర్ 127/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కల్పన ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు. దర్యాప్తులో కల్పనకు మానూర్ మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు తన అన్న గైని విట్టల్, కల్పనతో కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, కల్పన – పండరి మధ్య కొంతకాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ముత్యం రెడ్డి పలుమార్లు భార్యను మందలించినప్పటికీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భర్త తమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని భావించిన కల్పన హత్యకు పథకం రచించింది. మే 16న ముత్యం రెడ్డిని బోర్ మోటార్ స్టార్టర్ రిపేర్ పని ఉందని నమ్మించిన పండరి, అతడిని తన పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే ఉన్న విట్టల్‌తో కలిసి తాడుతో మెడ బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని ముందుగా జేసీబీతో తవ్విన గుంతలో పాతిపెట్టి మట్టితో కప్పివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గైని పండరి (24), గైని విట్టల్ (33), శంబనోల్లా కల్పన (30)లను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
