. . . నిత్యం లక్షల్లో లావాదేవిలు
. . . నిజామాబాద్, ఆర్మూర్ ప్లేయర్లే అధికం
. . . ఒకప్పుడు పేకాట . . . ఇప్పుడంతా మట్కా
నిజామాబాద్, బతుకమ్మ :
ఆదిలాబాద్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని బోరిలో పది మట్కా గేమ్ లు . . . 20 యూపీఐ చెల్లింపులు అన్న చందంగా సాగుతుంది. ఒకప్పుడు పేకాట క్లబ్ లకు పేరొందిన బోరి ప్రస్తుతం మట్కా కేంద్రంగా మారింది. పత్తాలాట కోసం అటు వైపు వెళ్లిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పూర్వపు జిల్లాలకు చెందిన ప్లేయర్లు మట్కా మాయలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు చార్ట్ లలో సాగిన మట్కా ఇప్పుడు ఆన్ లైన్ మయమైంది. ఒకప్పటి తోక చీట్టీల స్థానంలో స్మార్ట్ ఫోన్ దానిని కబ్జా చేసింది. రూపాయి నగదు చెల్లింపులు కానీ, మట్కా చీట్టీలు లేకుండానే ఆన్ లైన్ మట్కా కొనసాగుతుంది. పేకాట ఆడేందుకు వెళ్లిన వారిని మట్కా ఆడేందుకు ముగ్గులో దింపింది బోరి ముఠా. దానితో ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్లేయర్లు బోరికి వెళ్లకుండానే మట్కా ఆడుతున్నారు. మొన్నటి వరకు యాప్ ల ద్వారా ‘సామ్రాట్’ ఆడిన ప్లేయర్ల కంటే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజి) తెలియని వారు కూడా ఆడే విధంగా వాట్సాప్ లో మట్కా కొనసాగుతుంది.
ఇటీవల కాలంలో బోరి ప్రాంతానికి చెందిన కీలక బూకిగా పేరొందిన ప్రధాన సూత్రదారి ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత అతనిని బైండోవర్ చేయడంతో తన కార్యకలాపాలను పరిమితం చేశాడు. పోలీసులకు చిక్కకుండా డజన్ మంది సబ్ ఏజంట్ల ద్వారా మట్కాను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు తన అకౌంట్ (బ్యాంక్ ఖాతా)కు స్కానర్ ద్వారా, ఫోన్ పే నంబర్ తో నేరుగా డబ్బులు వేయించుకని మట్కా ఆడించిన ప్రధాన సూత్రదారి ఇప్పుడు తన ప్రధాన ఏజంట్ల ద్వారా మట్కా కోసం యూపీఏ చెల్లింపులు చేయించుకుని వాట్సాప్ ద్వారా రూ.10తో గేమ్ ఆడితే రూ.100 చెల్లింపులు, రూ.100 తో గేమ్ ఆడితే రూ.1000, రూ.1000తో గేమ్ ఆడితే రూ.10 వేల చెల్లింపులు మొదలుకుని లక్ష రూపాయల గేమ్ వరకు డబ్బుల చెల్లింపులు చేస్తుండడంతో ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని కరీంనగర్, నిజామాబాద్ జిల్లా ప్లేయర్లు జోరుగా మట్కా ఆడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లలో యూపీఏ చెల్లింపులు జరిపి వాట్సాప్ ద్వారా పందేం కాస్తున్నారు. ఒక్క నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల నుంచే నిత్యం లక్షల లావాదేవిలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ లో పేకాట అర్గనైజర్లుగా పేరున్న చాలా మంది ప్రధాన సూత్నదారి దగ్గరనే మట్కా ఆడిస్తారనేది టాక్ ఉంది. ఇప్పటికీ అక్కడి నుంచి జరిగే పెద్ద మొత్తం లావాదేవీలంతా ఆర్గనైజర్లే చూస్తారని సమాచారం.
మట్కా మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ లలో సామ్రాట్ యాప్ ద్వారా జరిగింది. అయితే యాప్ డౌన్ లోడ్ తో పాటు యూపీఐ చెల్లింపులు,పాస్ వర్డ్ ల విషయంలో చాలా మందికి సాంకేతిక విషయాలు అర్థం కాకపోవడంతో దాని స్థానంలో వాట్సాప్ మట్కాకు తెరలేపారు. వాట్సాప్ మట్కాలో ప్రధానంగా ఉదయం నుంచి మార్నింగ్ శ్రీదేవి, టైంబజార్, మధర్ డే, మిలాన్ డే, రాజధాని డే, కళ్యాణి, మిలాన్ నైట్, రాజధాని నైట్, మెయిన్ బజార్, కళ్యాణి నైట్ లాంటి గేమ్ ల ద్వారా మట్కాను ఆడిస్తున్నారు. ఒకప్పుడు నాందేడ్, ధర్మాబాద్ ఇతర ప్రాంతాల నుంచి మట్కా గేమింగ్ ను ప్రస్తుతం బోరి అక్రమించింది. కేవలం నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ ప్రాంతాల నుంచి యూపీఏ చెల్లింపులు నిత్యం రూ.20 లక్షల వరకు ఉన్నాయని టాక్ ఉంది. మొన్న పోలీసులు బోరి ప్రాంతంలో మట్కాపై ఉక్కుపాదం మోపినప్పుడు వెనుకబడిన ఆట మళ్ళీ పుంజుకుంది. కీలక బూకీ స్థానంలో సబ్ ఏజంట్లు ప్రవేశించడంతో ఇప్పుడు ఈ గేమ్ 20 మట్కా గేమ్ లు అయితే 50 యూపీఏ చెల్లింపులుగా సాగుతున్నట్లు తెలిసింది.
