. . . తప్పిన పెను ప్రమాదం
వర్ని, బతుకమ్మ :
మూల మలుపు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వెళ్తున్న ఇసుక టిప్పర్ ఢీ కొట్టిన ఘటన శనివారం వర్ని మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఓవర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బడాపహాడ్ నుంచి వర్ని వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మూల మలుపు వద్ద ఆగి ఉండగా వర్ని నుంచి వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ అదుపు తప్పి బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు సీట్లకు తగిలి గాయపడగా, మరి కొందరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయ పడిన వారిని 108 అంబులెన్సుల సహాయంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంత సేపు రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించారు. ప్రయాణికులు మాట్లాడుతూ బస్సు ఆగి ఉన్న సమయంలోనే టిప్పర్ వేగంగా వచ్చి ఢీ కొట్టిందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లు ఓవర్ లోడ్ తో వేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, సంబందిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

