. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
. . . మత్స్య ప్రగతి, ప్రణాళికలో పాల్గొన్న కలెక్టర్, మేయర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అన్ని వర్గాల వారి అభ్యున్నతి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, విరివిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి తదితరులు విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.

మత్స్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, అమలవుతున్న పథకాలు, ఇప్పటివరకు ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్దిదారుల వివరాలను అధికారులు తెలియజేశారు. మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని అన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందని, అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అదే విధంగా అర్సపల్లి లో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడటం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా జిల్లా అధికారుల చొరవ తో ప్రహరీ నిర్మాణం చేపట్టడం తో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇదివరకు మత్స్య శాఖకు సంబంధించి కార్యక్రమాలు మొక్కుబడిగా జరిగేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ మత్స్య కార్మికుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగల్గుతారని సూచించారు. అర్సపల్లిలో గల ఎంతో విలువైన మత్స్య కార్మిక సంఘం స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి, సీ.సీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఆయా సంఘాలకు ప్రభుత్వ పరంగా కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంఘ బాధ్యులు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా హితవు పలికారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడీ ఆంజనేయ ప్రసాద్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

