. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు గురించి తెలియజేసినట్టయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం గర్బస్తపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని, రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు స్కానింగ్ చేయుటకు అర్హులని, అదే విధంగా కార్డియాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్ కూడా స్కానింగ్ చేయవచ్చన్నారు. పిసిపిఎన్డిటి చట్టం ద్వారా నమోదైన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని, నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలిపారు. ఏ వైద్యులు అయితే స్కానింగ్ మిషన్ కొనాలని అనుకుంటాలో వారు ముందుగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. తర్వాత స్కానింగ్ మిషన్ వచ్చిన ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు, అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలిని తెలిపారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలో వైద్యుల సమయపాలన వేళలను చార్ట్ ద్వారా ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలో మొత్తం 131 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని వీటిలో 87 నిజామాబాద్ డివిజన్లో, 30 ఆర్మూర్ డివిజన్లో, 14 బోధన్ డివిజన్లో ఉన్నాయన్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో 96 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. స్కానింగ్ ఫామ్ ఎఫ్ పైన ప్రతి గర్భిణీ స్త్రీ పేరు, వయస్సు, లింగం, చివరిసారి రుతుస్రావం అయిన తేదీ, అన్ని రకాల ప్రమాదా లక్షణాలను వ్రాయాలన్నారు. రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, ఏ స్కానింగ్ కేంద్రాన్ని అయినా కేంద్ర తనిఖీ బృందాలు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎప్పుడైనా ఎక్కడైనా తనిఖీ చేసే అధికారం ఉందన్నారు. ప్రతి స్కానింగ్ నకు డాక్టర్ సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమని, ఈ సమావేశంలో నాలుగు ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రాలకు అనుమతించిడం జరిగిందని, తర్వాత జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపించడం జరుగుతుందన్నారు. పిసిపిఎన్డిటి చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గిపోతున్నదని పుట్టబోయే శిశువు అమ్మాయైనా, అబ్బాయైనా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ నిషిత, గైనకాలజిస్ట్ డాక్టర్ నీ షాత్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకటేష్, డి హెచ్ ఈలు వేణుగోపాల్, ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
