. . . జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి పిలుపు
. . . కలెక్టర్ చొరవతో గృహ హింస నిరోధక చట్టంపై మిషన్ అపరాజిత పేరుతో అవగాహన సదస్సు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ గౌరవానికి భంగం వాటిల్లనివ్వకుండా, హక్కులను కాపాడుకోగల్గుతారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అనేక మంది మహిళలు గృహ హింసకు సంబంధించిన అంశాలపై అర్జీలు అందించడాన్ని దృష్టిలో పెట్టుకుని, గృహ హింసకు వ్యతిరేకంగా మహిళల్లో చైతన్యం పెంచేలా జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి చొరవతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ అపరాజిత’ పేరుతో గృహ హింస నిరోధక చట్టంపై శనివారం సాయంత్రం కలెక్టరేట్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించబడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అంగన్వాడి కార్యకర్తలను, మహిళా సర్పంచ్ లను ఆహ్వానించారు. జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సెషన్స్ జడ్జి శ్రీదేవి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొని గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింసకు గురైన బాధిత మహిళల ఇబ్బందులను తెలుసుకుని, వారికి తగిన సహకారం లభించేలా చూస్తామని సాంత్వన కల్పించారు. ఓ బాధితురాలికి అదార్ కార్డు లేకపోవడం వల్ల గృహ హింస కేసు విషయంలో తగిన న్యాయం పొందడం లేదని తెలుపడంతో, కలెక్టర్ అప్పటికప్పుడే స్పందించి తన సమక్షంలోనే ఆన్లైన్ లో దరఖాస్తు చేయించడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి మాట్లాడుతూ, గృహ హింస నిరోధక చట్టం ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న హక్కులు, రక్షణ చర్యలు, చట్టపరమైన సహాయం గురించి వివరించారు. కుటుంబంలో జరిగే మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులు కూడా గృహ హింస కిందికే వస్తాయని, ఇలాంటి సందర్భాల్లో మహిళలు భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం (వన్ స్టాప్ సెంటర్) సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సఖీ కేంద్రాల ద్వారా అత్యవసర సహాయం, ఉచితంగా న్యాయ సహాయం, వైద్య సేవలు వంటివి ఒకే చోట అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతీకూల పరిస్థితులు ఎదురైన సమయాలలో మహిళలు నిర్వేదానికి లోనవకుండా స్వేచ్చగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని, సఖీ సెంటర్ ను సంప్రదించాలని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, మహిళల హక్కులకు అది ఆటంకంగా మారితే న్యాయం కోసం జిల్లా న్యాయ సేవాదికార సంస్థను కూడా సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలు స్వతహాగా ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఉంటారని, మీ శక్తి యుక్తులను తెలుసుకుని అన్యాయాలను ధైర్యంగా ఎదురించాలని పిలుపునిచ్చారు. చిన్న నాటి నుండే ఆడపిల్లలను ధైర్యం నూరిపోస్తూ పెంచాలని, వారి గౌరవానికి భంగం కలిగినా, ఎక్కడైనా అన్యాయం ఎదురైనా తిరగబడాలని నేర్పాలన్నారు. మహిళల హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చట్టాలు ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల రక్షణకు కట్టుబడి పని చేస్తున్నామని అన్నారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకుని, అవసరమైనప్పుడు సఖీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలే మహిళలకు శత్రువు అనే నానుడిని రూపుమాపే విధంగా ప్రతి మహిళా ఆపదలో ఉన్న సాటి మహిళను ఆదుకునేందుకు తన శాయశక్తుల కృషి చేయాలని హితవు పలికారు. గృహహింసకు గురైన బాధిత మహిళలకు జిల్లా యంత్రాంగం తరపున అవరసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆర్మూర్ సెషన్స్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన పెరిగితేనే గృహ హింస ఘటనలు తగ్గుతాయని తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడకూడదని, న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గృహ హింస నిరోధక చట్టం, పోక్సొ చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ పద్మ, జీ.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, పొలీస్ ఇన్స్ పెక్టర్ శ్రీలత, సీ.డీ.పీ.ఓలు, ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

