. . . కాంగ్రెస్ భవన్ శంకుస్థాపన వేడుకల్లో ఘటన
. . . జూనియర్ లపై సీనియర్ల మండిపాటు
. . . సర్ధిచెప్పిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ నూతన భవనం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం సీనియర్లకు ఘోర అవమానానికి వేదిక అయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కాంగ్రెస్ భవన్ ఎదుట నూతన భవన నిర్మాణానికి బుధవారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనుసూయ(సీతక్క)లు ముఖ్య అతిథులుగా హాజరైన కార్యక్రమంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టారు. దానితో వారు తీవ్ర అసహనానికి గురయ్యారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం కాంగ్రెస్ భవన్ లో సమావేశం నిర్వహించారు. సమావేశ వేదిక నిర్వాహణ బాధ్యతలు జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి పర్యవేక్షించగా సీనియర్లకు కుర్చీలు లేకుండాపోయాయి. ప్రధానంగా 9 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడిగా ఉన్న గడుగు గంగాధర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా చేసి ప్రస్తుతం తెలంగాణ సహకార సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఒకప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు ఆకుల లలితతో పాటు బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఇంచార్జి వినయ్ రెడ్డిలకు వేదికపై స్థానం దక్కలేదు. వారు కూడా కార్యకర్తల మాదిరిగా వేదికకు ముందుగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గడుగు గంగాధర్ జిల్లా అధ్యక్షుడికి తెలియజెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో సీనియర్లకు గౌరవ మర్యాదలు లేవని మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర పీసీసీ కోశాధికారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీనియర్లను వేదికపైకి పిలువరా అని అగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులకు సర్ధిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం లాంటిదని అక్కడ ఎవరికి ఎప్పుడు మర్యాదలు దక్కుతాయో ఎప్పుడు అవమానం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలోనే కాంగ్రెస్ నాయకులకు అవమానం జరుగడాన్ని వారు జీర్ణించుకోలేపోయారు. కాంగ్రెస్ భవన నిర్మాణం కోసం జరిగిన వేదికలో తప్పిదాలపై ఎవరు కూడా సరైన సమయంలో స్పందించకపోవడమే అవమానానికి కారణమని చర్చ జరిగింది.

