24 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దొడ్డు రకం ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండలం చంద్రాయణపల్లి, గన్నారంలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

Collector inspects grain purchase centers

 

ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా, ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం జరిపించి, వెంటదివెంట నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరిగితే, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. సన్నరకంతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు.

 

Collector inspects grain purchase centers

 

వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని, తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ హితవు పలికారు. ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగులు వంటి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ వెంట డీ.ఎస్.ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, డీ.ఎ.ఓ వీరస్వామి, ఎ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, ఎం.పీ.డీ.ఓ అనంత్ రావు తదితరులు ఉన్నారు.

More articles

Latest article