30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులపై ట్రిబ్యునల్ వేస్తం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసే కుట్ర జరుగుతుంది

 

. . . హేట్ స్పీచ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి బిల్ రాలేదు.

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించి, జైలుకు పంపాలని చూస్తే, రాబోయే బీఆర్ఎస్ పాలనలో పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బసిరెడ్డి సంతోష్ రెడ్డిని అకారణంగా అరెస్ట్ చేసి, రాత్రికి రాత్రే జైలుకు పంపగా, ఈ రోజు మహబూబ్ నగర్ జైలులో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తో కలిసి పరామర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రెటెడ్ గురుకుల పాఠశాలను ఇథనాల్ ఫ్యాక్టరీకి దగ్గరలో పెట్టడాన్ని వ్యతిరేకించినందుకు, వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. స్వయంగా ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు ఉన్నదని కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. సంతోష్ రెడ్డి కేవలం సామాన్య కార్యకర్త అని, ఆయన నక్సలైట్ లేదా టెర్రరిస్ట్ కాదని, పోలీసులు ఎలా అక్రమ కేసులు పెడతారని నిలదీశారు. ఎమ్మెల్యే దగ్గర పోలీసులు తుపాకులతో పహారా ఉంటారని, ఆయన ప్రాణానికి ఎలా ముప్పు ఉంటుందని పోలీసులను ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను అణచివేయాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరులో ఎస్‌హెచ్‌ఓ ఆర్టీసీ కార్మికులకు టెంట్ హౌస్, నీళ్లు, ఇతర సామాగ్రి ఇవ్వకూడదని ఆదేశాలివ్వడంపై మండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా సమ్మె చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హోం మంత్రికి ఈ విషయం తెలియదా? డీజీపీ, హోం శాఖ సెక్రటరీ చెప్పలేదా అంటూ చురకలంటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వార్తలను రాస్తే జర్నలిస్టులపై కూడా కేసులు పెడతారా? అంటూ ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్, ఇతర నియోజకవర్గాల్లో అక్రమంగా ఇసుక మాఫియా జరుగుతుందని అధారాలతో, వీడియోలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ నాయకులు జగ్గారెడ్డి పోలీసు అధికారులను ఎవరికి పుట్టినవురా అంటూ దుర్భాషలాడినా ఇప్పటికీ ఆయనను కనీసం ఎగ్జామిన్ చేయకపోవడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగలేదని, బాంబులతో పేల్చారని 2023 అక్టోబర్ లో కేసు నమోదైతే, పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మొన్న రేవంత్ రెడ్డి మేడిగడ్డ దగ్గరకు వెళ్లినప్పుడు హోం మంత్రిగా ఆ కేసు గురించి ఎందుకు రివ్యూ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆయనే ఇపుడు హోం మంత్రిగా ఉన్నారని, పోలీసులు ఆయన ఆదేశాలు పాటిస్తే వారికి తర్వాత రోజుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండదని పోలీసులు గమనించాలని తెలిపారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల అరాచకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇపుడున్న పోలీసులను బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని చెప్పడం లేదని, రాజ్యాంగ బద్దంగా, చట్ట ప్రకారంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రజలను నిరోధించడానికే ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దీనివల్ల జర్నలిస్టులు, కార్యకర్తలు ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుందన్నారు. వాట్సాప్ స్టేటస్ పెట్టినా, మెసేజ్ ఫార్వర్డ్ చేసినా, సోషల్ మీడియాలో ఏం రాసినా అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 19 ని అపహాస్యం చేసినట్టేనని, ఎమర్జెన్సీ సమయంలో కూడా దేశంలో ఇలాంటి బిల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

More articles

Latest article