. రాజకీయాలకు బలైన ఇందూర్ దసరా ఉత్సవాలు
. కొన్నేళ్లుగా కానరాని రావణ దహనం
నిజామాబాద్, బతుకమ్మ: దసరా పండగ ఇందూరులో కళ తప్పింది. శరన్నవరాత్రులు, దశమి (దసరా) రోజున రావణ దహనం అనే సంప్రాదాయం ఇందూర్ లో ఉండేది. అలాంటి దసరా ఉత్సవాలకు రాజకీయ మకిలి అంటి ఉత్సవ వేడుకలు గతి తప్పాయి. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం వరకు హిందూ ధార్మిక సంఘాలు, హింధూ సంఘాలు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. నిజామాబాద్ లో రావణ దహనం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించే వారు. అదే రోజు సిక్కులు బైసాకీ పండుగ నిర్వహించడంతో రెండు పండుగలతో ఇందూరు కళకళలాడేది. ఉమ్మడి రాష్ర్టంలో రావణ దహనం కార్యక్రమాన్ని నగరంలోని ఖలీల్ వాడి మైదానం ( ప్రస్తుత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి) నిర్వహించేవారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరుకావడంతో రావణ దహనం కార్యక్రమాన్ని కలెక్టరేట్ గ్రౌండ్(పాత) తరువాత పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి మార్చారు. ఉత్సవాలను హిందూ సంస్థల నిర్వహించేవి. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రావణ దహనం కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా మారిపోయింది. అయితే, ఆ హడావుడి ఐదు సంవత్సరాలకు పరిమితమైంది. తరువాత కాలంలో రవాణ దహనం, అలయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహణ గాడి తప్పింది. తరువాత రావణ దహనం కార్యక్రమాలు నిలిచిపోయాయి. తరువాత కాలంలో కొన్ని సంఘాలు కుడా రావణ దహనాన్ని అడ్డుకుంటామని పిలుపునివ్వడం కుడా ఓ కారణం. నిజామాబాద్ నగరంలో నిర్వహించే రావణ దహనం కార్యక్రమాలను ఏ రాజకీయ పక్షాలు, హిందూ సంస్థలు పట్టించుకోకపోవడంతో వేడుకలు కనుమరుగయ్యాయి. ఇందూర్ నగరంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ఓ వేదిక అవసరం అత్యవశ్యకంగా మారింది. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, హిందువులు నిర్వహించే దసరా ఉత్సవాలకు పూర్వ వైభవం రావాలని కోరుకుందాం.
