. . . నిజాంసాగర్ పోలీసుల కృషితో నేరస్తుడికి శిక్ష
. . . పోలీసులను అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి అఘాయిత్యం చేయడమే కాకుండా పెళ్లి చేసుకున్న వివాహితుడికి ఫోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శేఖర్ వివాహితుడు. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక ఆస్తిపై కన్నేసి దాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో శేఖర్ బాలిక ఫోన్ నెంబర్ సంపాదించి తరచూ మాట్లాడుతూ నమ్మకం కలిగించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2023 మే 6న బాధితురాలి తల్లి పిట్లం మార్కెట్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి మైనర్ బాలికను తనతో తీసుకెళ్లి వర్ని మండలంలోని బడాపహాడ్‌కు తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టాడు. అనంతరం బాధితురాలిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటి పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిస్సింగ్ బాలిక ఆచూకీ తెలిసిన తర్వాత నిందితుడి నేరం బయటపడగా మైనర్ అని తెలిసి కూడా ప్రేమవివాహం పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడినందుకు వెంటనే పోక్సో కింద నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి నేరాన్ని నిరూపించడానికి అవసరమైన అన్ని బలమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన గౌరవ జిల్లా న్యాయమూర్తి డా.వరప్రసాద్ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసును సమర్థంగా విచారణ చేసిన అప్పటి నిజాంసాగర్ ఎస్‌హెచ్‌ఓ ఎన్.రాజు, బాన్సువాడ డీఎస్పీ కె.జగన్నాథ రెడ్డి, పోలీసు తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శేషు, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ శివకుమార్, సీఐ తిరుపయ్య, డీఎస్పీ విట్టల్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
