. . . హై కోర్టు జడ్జీ రాజేశ్వర రావు
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ పదవీవిరమణ బకాయిలు దాదాపు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదని గత ఏడాది కోర్టుని ఆశ్రయించారు. అందుకు స్పందిస్తూ న్యాయమూర్తి రాజేశ్వర రావు ఆ బకాయిలను సత్వరం చెల్లించాల్సిందిగా గత సంవత్సరం ఆదేశాలు ఇచ్చారు. అయితే, సంవత్సరం పైచిలుకు గడిచినా ఆ ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయకపోవడంతో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై చర్యలు కోరుతూ ఓ ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. అనేక గడువుల తర్వాత గత గడువు సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శినీ వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ “ఫాం వన్” జారీ చేస్తూ దాదాపు 644 కోర్టు ధిక్కార కేసులను ఈ రోజుకి వాయిదా వేశారు. అయితే ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి మాత్రం సోమవారం కూడా కోర్టుకి హాజరు కాలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, అకవున్టేంట్ జనరల్ ఆఫీసుల తరపున కోర్టుకి హాజరు అయ్యారు. కోర్టు ఆదేశాల అమలు కోసం గతంలో చాలా సార్లు విజయవంతంగా కోర్టు ద్వారా గడువులు పొందిన ప్రభుత్వ న్యాయవాది ఈ రోజు కూడా ఆర్థిక కార్యదర్శి కోసం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ అభ్యర్థించడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాల్సిందిగా కోర్టు గత ఏడాది ఆదేశాలు ఇచ్చిందని, వాటిని ఇప్పటివరకూ పూర్తిగా ప్రభుత్వం అమలు పరచలేదన్నారు. కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై నోటీసులు జారీ చేసికూడా ఆరు నెలలు దాటిందని, ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించిన వార్తలు వచ్చాయని, వ్యక్తిగతంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా హాజరు కావాల్సిందిగా గత గడువు నాడు ఈ కోర్టు ఆదేశించిందని తెలిపారు. అయినా కూడా తను హాజరు కాకపోవడం పట్ల ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో మునిగి ఉన్నారనీ, కోర్టుకి రాలేక పోయారనీ, అందుకే ఈలోపు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఈరోజు కోర్టుకి ఉదయం విన్నపం సమర్పించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న సంగతి వాళ్లకి ముందే తెలిసినందున అలాంటి విన్నపం ఏదైనా ఉంటే ముందే సమర్పించి ఉంటే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేదనీ, అలా చేయకపోవడాన్ని ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. కావాలంటే ఈరోజు అర్థరాత్రి వరకైనా కావాలంటే నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తాను. వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని న్యాయమూర్తి రాజేశ్వర రావు విస్పష్టంగా పేర్కొన్నారని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల తరపు న్యాయవాది సీ ఆర్ సుకుమార్ తెలిపారు.
