. . . విజిలెన్స్ దాడుల్లో 15 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి పాత బస్టాండ్, ఆచన్‌పల్లి చౌరస్తా తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచన్‌పల్లి చౌరస్తాలో ఉన్న దీపక్ స్వీట్ హోమ్ లో సోదాలు నిర్వహించగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్లను సీజ్ చేసి స్వీట్ హోమ్ యజమాని మహావీర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో ప్రాంతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను గుర్తించి ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ హనుమంతు తెలిపారు. గృహ అవసరాలకు సబ్సిడీతో అందించే డొమెస్టిక్ గ్యాస్‌ను హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పవన్, మహేష్ పాల్గొన్నారు.
