. . . ప్రజల ప్రాణాలతో చెలగాటం
. . . లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
. . . నిద్ర మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు
రుద్రూర్, బతుకమ్మ :
జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏదైనా ప్రజలు నేరుగా మెడికల్ షాపు వెళ్ళి మందులు కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్, కనీసం ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపు యజమానులు మందులు అందజేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌తో పాటు రెండు, మూడు రకాల టాబ్లెట్లు ఇచ్చి ప్రజల అవసరాలను ‘క్యాష్’ చేసుకుంటున్నారు. మందులు వాడినా జబ్బు నయం కాకపోతే అప్పడు వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తుండడంతో మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మెడికల్ షాపు వారు ఇచ్చే మందులతో తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నా దీర్ఘకాలికంగా దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాప్ లో బీఫార్మసీ చేసిన ఫార్మసిస్టు ఉండాలి. కానీ రుద్రూర్ మండల కేంద్రంతో పాటు వర్ని, కోటగిరి, పోతంగల్, చందూర్, మోస్రా మండలాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ పలు మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టు లేకుండానే, డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే, అనుభవం లేని వ్యక్తుల ద్వారా మందులను కొనుగోలు చేస్తున్నారు. మెడికల్ షాపును నిర్వాహించాలంటే డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్టు-1940, ఫార్మసీ యాక్టు-1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే మెడికల్ షాపులను నిర్వహించాల్సి వుంటుంది. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత పార్మసిస్టుల సర్టిఫికెట్లతో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో అనుసంధానం చేసి డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాల్సి వుంటుంది. అనంతరం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు మంజూరైన తర్వాతే షాపులను నిర్వాహించాల్సి వుంటుంది. కొన్ని మెడికల్ షాప్ దుకాణ యజమానులే, ఆర్ఎంపీ డాక్టర్లతో రోగులకు వైద్యం చేయిస్తూ తమ మెడికల్ షాప్ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జోరుగా కొనసాగిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి ఇలా ఏదైనా సరే నేరుగా మెడికల్ షాప్ కు వెళ్తే డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

. . . లైసెన్సు ఒకరిది నిర్వహణ మరొకరిది
మెడికల్ షాప్ లో బీ ఫార్మసీ చేసిన వారే ఉంటూ మందులు ఇవ్వాలి కానీ చాలా వరకు అద్దె లైసెన్సులు తెచ్చుకొని మెడికల్ దందా నిర్వహిస్తున్న వారే అధికంగా ఉన్నారు. సంబంధిత శాఖ అధికారుల అండ దండలతోనే ఏ టెన్షన్ లేకుండా సాఫీగా కొనసాగుతున్నాయని విమర్శలు బహిరంగంగానే వస్తున్నాయి. చిన్న క్లినిక్ నుంచి నర్సింగ్ హోమ్ వరకు ఎవరికి వారే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుని కాస్త అనుభవం ఉన్నవారితో మందులు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఇళ్లల్లో మెడికల్ షాప్ ను తలపించేలా అన్ని రకాల మందులను తమ వద్ద ఉంచుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి ఆర్ఎంపీ వద్ద ఏ మందులు ఉండకూడదు. వైద్యం కోసం తమ వద్దకు వచ్చిన వారికి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కానీ అనేక గ్రామాల్లో బహిరంగంగానే మందులు ఇంజక్షన్లు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
