. . . రూ. 3.24 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్ధిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత అని, రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 194 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 1,94,22,504,

130 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 1,30,15,080, మొత్తంగా దాదాపు రూ. 3,24,37,584 విలువైన చెక్కులను అందజేశామని వివరించారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలను, కీలకమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే నెరవేర్చిందని గుర్తు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, న్యూడా చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

