నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా జ్యూడిషియరి, జిల్లా పోలీసుల మధ్య శనివారం ఎడపల్లి మండల పరిధిలో గల జానకం పేట్ పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో జరిగిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో జ్యుడిషియరీ క్రికెట్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జ్యూడిషియరి జట్టు 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భారత లక్ష్మీ విజేత జట్టు జ్యూడిషియరికి, రన్నర్ గా నిలిచిన పోలీస్ జట్టుకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోర్టులు అనే నాలుగు గోడల మధ్య విధులు నిర్వహించే న్యాయధికారులు మైదానంలోకి వచ్చి వికెట్ల మధ్య పరుగెత్తుతు పరుగులు సాధించడం ఆనందదాయకమేనని అన్నారు. పోలీసులు అంటేనే ఫిట్నెస్ కలిగి ఉంటారని అలాంటి టీమ్ పై జ్యూడిషియరీ టీం విజయం సాధించడం గొప్ప విషయమేనని పేర్కొన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే వారికి క్రీడలు టానిక్ ల పని చేస్తాయని అన్నారు. న్యాయ, పోలీసు వ్యవస్థలకు అవినాభావ సంబంధం ఉన్నదని ఇలాంటి కార్యక్రమాలతో అవి మరింత బలపడతాయని అన్నారు. ఆటలో వికెట్ల కోసం, పరుగుల కోసం పరుగెత్తినట్లు కోర్టు కేసుల పరిష్కారంలో అంతే హుషారుగా వెళదామని ఆమె చమత్కరించారు. న్యాయం కోసం తపిస్తున్న సామాన్యుడే మనకు లక్ష్యం కావాలని, లక్ష్య సాధనలో మనమంతా కలిసి నడిచి న్యాయసేవలను కలిసి పంచుదామని అన్నారు. అందరూ ప్రతి రోజు ఆరోగ్య పరిరక్షణ కోసం సమయం వెచ్చించాలని జిల్లాజడ్జి సూచించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మా పోలీసులే ఫిట్నెస్ కలిగి ఉంటారని అనుకునే వాడినని కానీ న్యాయమూర్థులు ఫిట్నెస్ ముందు ఓడిపోయామని సరదాగా వ్యాఖ్యనించారు. ఎదో ఒక సమయంలో కలిసిపోయి కలిసికట్టుగా ఆటలు ఆడటంలోనే ఆనందం ఉన్నదని, అది శరీర దృఢత్వానికి దారి తీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు హరీష్, శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, చైతన్య, హరి కుమార్, శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వరెడ్డి, నిజామాబాద్ బోధన్, ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

