26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల జోలికొస్తే ఖబర్దార్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

 

. . .విద్యార్థి నాయకుల అరెస్టు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకుందాం అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల పేరుతో నిలిపివేసి విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు పోలీసుల చర్యలను ఖండిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1964లో ఏర్పడిన కాలేజీ ఎడ్యుకేషన్ సొసైటీకి రైతుల నుంచి 268 ఎకరాల భూమిని సేకరించి అప్పగించారు. రైతులు చెమటోడ్చి  రక్తపు బొట్టుతో కూడబెట్టిన ఆ భూములను కాపాడటంలో సొసైటీ సభ్యులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ సభ్యులుగా ఉన్న సమయంలోనే భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోలేదని, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సభ్యులుగా, ఆయన తండ్రి కె.పి. రాజిరెడ్డి సెక్రెటరీగా ఉన్న కాలంలోనే అనేక అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి 26 ఎకరాల భూమి అప్పగించడంలో ఎమ్మెల్యే రమణారెడ్డి కీలకపాత్ర వహించారని ఆరోపించారు. అరోరా యాజమాన్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటివరకు ఒక పైసా అద్దె కూడా చెల్లించలేదని, పైగా కేసులు వేసి ఆ భూమి మాదేనని చెప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు. అదే విధంగా శిశు మందిర్ పాఠశాలకు కూడా రెండు ఎకరాల భూమిని అక్రమంగా లీజు ఇచ్చారని, ఈ వ్యవహారాలన్నింటికీ అప్పటి సొసైటీ సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే రమణారెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టార్జితమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా చేయనివ్వమని, కాలేజీ భూముల పేరుతో జరిగిన అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు అని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన ప్రతి ఎకరం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. కామారెడ్డి, పరిసర గ్రామాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భూములను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడమే అసలు లక్ష్యమని వెల్లడించారు. ఏ లక్ష్యంతో రైతులు భూములు ఇచ్చారో, ఆ లక్ష్యం నెరవేరే వరకు అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పోరాడుతామని, వెనుకడుగు వేయమని ప్రకటించారు.

 

Khabardar is concerned about the land of Kamareddy Government Degree College.

 

పోలీసుల ముందస్తు అరెస్టులతో సమావేశం నిలిచిపోయినా ఉద్యమ స్ఫూర్తి మాత్రం మరింత బలపడిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం అణచివేయలేరని, ఇది కేవలం భూముల కోసం పోరాటం కాదు విద్యా హక్కు కోసం, భవిష్యత్ తరాల కోసం జరుగుతున్న ఉద్యమమని స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆజాద్, సందీప్ కుమార్, ఙివియం విఠల్, అరుణ్, లక్ష్మణ్, నాగరాజు, భరత్, వినోద్, వినయ్, సోఫియన్, డేవిడ్, రాహుల్ తదితరులున్నారు.

 

Khabardar is concerned about the land of Kamareddy Government Degree College.

 

More articles

Latest article