మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శీతాకాలం శిబిరం ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్ నివారించడమే ధ్యేయంగా గ్రామంలో నినాదాలు చేశారు. విద్యార్థిని, విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అదే విధంగా గ్రామంలోని అత్యంత అపరిశుభ్ర ప్రాంతమైనటువంటి చింత చెట్టు వద్ద ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన గ్రామపంచాయతీ ట్రాక్టర్లులో వేసి డంపు యార్డ్ కు తరలించారు. అనంతరం దోమల మందు చల్లారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేసి, విద్యార్థుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్, ఉపసర్పంచ్ సదానంద గౌడ, పంచాయతీ సెక్రటరీ మహిపాల్, కారోబార్ సుధాకర్, ప్రైమరీ హెల్త్ అధికారిని శ్రీలేఖ, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల గ్రూపులు, పంచాయతీ సిబ్బంది, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
