. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగర మేయర్‌గా ఉమారాణి శుక్రవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. అవినీతి రహిత పాలనే మా లక్ష్యమని, పట్టణాన్ని అవినీతికి తావులేకుండా, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఇవాళ మేయర్ పీఠాన్ని అప్పగించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజామాబాద్‌ను అభివృద్ధికి మారుపేరుగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తల కష్టానికి, ప్రజల ఆశీస్సులకు దక్కిన గౌరవం ఇది అని కొనియాడారు. నిజామాబాద్ నగరం నా సొంత గడ్డ అని, ఇక్కడి ప్రతి గల్లీ సమస్య నాకు తెలుసని, ప్రభుత్వ సాయంతో, నిధుల కొరత లేకుండా చూస్తూ.. మౌలిక సదుపాయాల కల్పనలో నిజామాబాద్‌ను అగ్రగామిగా నిలబెడతామని పేర్కొన్నారు. ఇక్కడ కేవలం పాలన మార్పు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే మార్పు వస్తుందని ఆయన తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా మేయర్ పనిచేయాలని సూచించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మంత్రివర్గం, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిజామాబాద్ కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేయర్ ఉమారాణి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు.

