. . . ప్రొఫెసర్ జి. హరగోపాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి రహదారులు, భవనాలు శాఖ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయులను తగ్గించే, పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకొని, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పర్యవేక్షణ అధికారులైన ఎంఈవో, డిప్యూటీ విద్యాధికారి, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లేని విద్యా విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని, పాఠ్యాంశాలలో సైంటిఫిక్ భావజాలాన్ని తగ్గిస్తూ, శాస్త్రీయమైన అంశాలను పాఠ్యాంశాలలో చెప్పిస్తూ, ప్రజలను మధ్యయుగంలోకి తీసుకెళ్లే విధంగా విద్యా విధానాన్ని రూపొందిస్తుందని, ఇది సరైన విధానం కాదని దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. ఫెడరల్ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకువచ్చే వికసిత భారత్ శిక్ష అభియాన్ బిల్లును వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం నుండి తప్పుకొని ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్, పి.విజయ రామ రాజు, విద్యార్టీ నాయకులు విఠల్, అర్వస్ కన్, తదితరులు పాల్గొన్నారు.
