. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం తిరిగి సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జెడ్పీ డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్నలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 34 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. కాగా, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళను సందర్శించి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ జరపాలన్నారు. బాలికల విద్యాలయాలు, హాస్టళ్ళలో విద్యార్థినుల భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేలా తగు జాగ్రత్తలు సూచించాలన్నారు. ఎక్కడ కూడా భోజనం కలుషితం కాకుండా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

