. . . ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే
. . . ఎంపీ అర్వింద్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు
. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు భాగంగా నిజామాబాద్ పట్టణంలోని కంటేశ్వర్ లో నిర్వహించిన ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ పోరులో మేయర్ పదవి కాంగ్రెస్ గెలవడం ఎందుకు అవసరం అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంపీ అర్వింద్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అర్వింద్ మేనమామకు మల్లెపూలు పెట్టినట్లు కాదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. అర్వింద్ తన ఆస్తులపై చర్చకు సిద్ధమా? అని మూడు కోట్ల రెంట్లు వచ్చే స్థాయికి అర్వింద్ ఎలా వచ్చారు? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ స్వార్థం కోసం మతం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న అర్వింద్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. అంబానీ, అదానీ ఆస్తులు పెరగడానికే మోదీ పాలన పనిచేస్తోందా అని ప్రశ్నించారు. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఇచ్చారా? దేవుడి పేరును రాజకీయాలకు వాడుకోవడానికి హక్కు ఎవరు ఇచ్చారన్నారు. ఓవైసీ ఫోటో ఇంట్లో పెట్టుకుని అర్వింద్ పూజ చేస్తారని అనిపిస్తోందని అన్నారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారని, సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమమన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం లేదని, హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేశామని, చేతకాని ఎంపీగా అర్వింద్ ఉండటం వల్లే నిజామాబాద్‌కు స్మార్ట్ సిటీ రాలేదన్నారు. బీజేపీ మేయర్ గెలిస్తే నిజామాబాద్‌కు ప్రయోజనం ఏముంటుందని, బీజేపీ, బీఆర్ఎస్‌కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టేన్నారు. కాంగ్రెస్ మేయర్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి దిశగా వెళుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే సభలో నిజామాబాద్ అభివృద్ధికి మరో ₹1000 కోట్లు ఇస్తామని ప్రకటించారన్నారు. ఎయిర్‌పోర్ట్ కు భూమి ఇచ్చి 20 సంవత్సరాలు అయినా నిర్మాణం జరగలేదన్నారు. రెండో దశలో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

