. . . కాంగ్రెస్‌ను వీడిన ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు.
. . . కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్లు.
బాన్సువాడ, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన నియోజకవర్గ కేంద్రం బాన్సువాడ పట్టణంకు చెందిన ఆరుగురు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ను వీడారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఎలమంచిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం వారంతా హైదరాబాద్ వచ్చి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు బీ ఫామ్‌లు సమర్పించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణంలో తాజా చేరికలతో కాంగ్రెస్ కోట కుప్పకూలినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌లో చేరికలతో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని స్పష్టంచేశారు. బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లలో బాడి శ్రీనివాస్, లాయక్, అక్బర్, ఖాదర్, గంగారామ్, రైటర్ రాజు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో బాన్సువాడ బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.
