– ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి
ఎడపల్లి, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ధూపల్లి గేట్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధూపల్లి క్రాసింగ్‌ను బ్లాక్ స్పాట్‌గా గుర్తించామని, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి ఆర్ అండ్ బి శాఖతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డుపై ప్రయాణం కంటే క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్యమని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ సీఐ విజయ్‌బాబు, ఎడపల్లి, బోధన్, రెంజల్ ఎస్సైలు ముత్యాల రమా, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు, పీఈటీ ప్రసూనతో పాటు యువకులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారికి గులాబీలు అందించి ప్రోత్సహించారు.

