. . . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి అభివృద్ధే తన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం గతంలోనే 120 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను పట్టణానికి తీసుకొచ్చానని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నీటి వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి తాగునీటి కష్టాలు తెచ్చిందని విమర్శించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ పథకం కింద రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. దీని ద్వారా రాబోయే 25 సంవత్సరాల వరకు కామారెడ్డి పట్టణానికి తాగునీటి సమస్యలు ఉండవని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, బీబీపేట్ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, లోయపల్లి నర్సింగరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్ నాయక్, రానా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
