…బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ డిపోలో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆర్టీసీ కార్మికుల నుండి బలవంతంగా వసూలు చేసిన మామూళ్ళ తో మేకలను బలిచ్చి జల్సాలు చేసిన నిజామాబాద్ ఆర్టీసీ ఒకటవ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్ ను, మెకానికల్ ఫోరమెన్ వసుందర లను వెంటనే సస్పెండ్ చేసి వారి సర్వీస్ లలో చేసిన అక్రమాలపై విచారణ జరపాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు.శుక్రవారం సుభాష్ నగర్ లో గల బి ఎల్ టి యు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన దావత్ పేరుతో గ్యారేజీలో మేకను వధించి చట్టాన్ని ఉల్లంఘించి జీవ వధను చేయడం విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఒకటవ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, మెకానికల్ ఫోరమెన్ వసందర లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ లో అపాయింట్ మెంట్ పొందిన నుండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా వివిధ పదవులతో డిపో మేనేజర్ స్థాయి వరకు ఎదిగిన ఆనంద్ ప్రమోషన్ కోసం అనేక మంది కార్మికులను ఆర్థికంగా, మానసికంగా వేధించినట్లు అనేక మంది కార్మికుల నుండి ఆరోపణలు ఉన్నాయన్నారు.ఆనంద్, వసుంధరల అక్రమాలను ప్రశ్నించిన కారణంగా అనేక మంది కార్మికులు సస్పెండ్ కు కారమయ్యారని దండి వెంకట్ తెలిపారు. ఆనంద్ అక్రమాల వల్ల ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జూలై నెలలో రిటర్మెంట్ ఉన్నందున వసుంధరతో కలిసి ఆర్టీసీ లోని ముఖ్యులకు దావత్ ఏర్పాటు చేయడంలో భాగంగా డిపో గ్యారేజీలో మేకను వధించడం జరిగిందని తెలిపారు.అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నిర్వహించడంపై ఏమైనా క్షుద్రపూజలు చేసి ఉంటారని కార్మికులు అనుమానిస్తు న్నారని చెప్పారు. ఏదీ ఏమైనా ఆర్టీసీలో డిపో పరిధిలో జీవహింస చేయడం నేరం కావున సదరు డిపో మేనేజర్ ఆదేశాలతోనే ఈ తంతు జరిగింది ప్రత్యక్ష సాక్షులు సంఘటనకు సంబంధించిన వీడియోలు ఉన్నప్పటికీ పై అధికారులు సదరు డిపో మేనేజర్ కి వంత పాడడం ఏమిటని దండి వెంకట్ ప్రశ్నించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు యాటల అనిల్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్,ఆర్టీసీ రిటైర్ సీనియర్ ఉద్యోగులు బి.శంకర్, ఆర్.నర్సిహులు పాల్గొన్నారు.
