నిజామాబాద్, బతుకమ్మ : నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ప్రధాని మోదీ ఒత్తిడి మేరకే ఈడీ కేసులు నమోదు చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకోవడానికి డిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులను ఎల్లమ్మ గుట్ట వద్ద పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దేవి థియేటర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలకు ఎదురుపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చెలరేగకుండా ఇరువర్గాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


