- పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య
ఆర్మూర్, బతుకమ్మ : దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుండి సివిఆర్ జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన , అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్వేచ్ఛ, చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిందని అన్నారు. నేడు ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయని, బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయింపులు చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నష్టం చేయడానికే విద్యకు బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ద్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి విద్యార్థులను గిగ్ వర్కర్ లుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెంచుతున్నారని, ప్రశ్నించే విద్యార్థులపై కేసు నమోదు చేసి జైల్లో వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వన్నీ విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి హిడ్మా లాంటి పోరాట యోధులను హత మారుస్తున్నారని, ప్రగతిశీల విద్యార్థులు విద్యార్థుల హక్కుల కోసం మహిళలు, ఆదివాసులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా , స్వేచ్చకై ఆత్మగౌరవంకై. అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని విద్యారులకు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగరాజు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయకరించడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని, ఒకవైపు ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్న అంటూనే మరొకవైపు స్కూళ్లను కాలేజీలను మూసివేస్తున్నారని, సంక్షేమ హాస్టల్స్ గురుకులాల్లో అనేక సమస్య నెలకొన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి అమరవీరులు కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల ప్రసాద్ పోరాటస్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభకి జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ అధ్యక్షత వహించారు, ఈ సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు పస్క నరసయ్య, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ దాసు, పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్ వక్తలుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

