- జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజల అభ్యున్నతి ప్రజాస్వామ్య పాలనతోనే సాధ్యమని, భారత రాజ్యాంగమే దీనికి మూలమని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల అలంకరణ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా భారత రాజ్యాంగం లిఖించబడిందని, ఆయన కృషి మేరకే ప్రస్తుతం పేద, బడుగు, బలహీన, మైనారిటీ విద్యార్థులు చదువుకుని మంచి స్థానాలలో నిలబడుతున్నారని అన్నారు. దేశ పాలనకు రూపొందించే చట్టపరమైన పత్రమే రాజ్యాంగం అని, ఇది ప్రాథమిక హక్కులు, విధులు నిర్దేశకత్వం చేస్తుందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో భిన్నమైన జాతులు, మతాలు సంస్కృతులు ఒకే దేశంలో కలిసి జీవించగలుగుతున్నారంటే కేవలం రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్ దశలోనే తమ భవిష్యత్తును నిర్మించుకోవడం సాధ్యమవుతుందని అందుకోసం బాగా చదివి రాణించాలని ఉద్బోధించారు. ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమ పరిరక్షణ, లౌకిక, సోషలిస్టు దేశంగా పరిఢవిల్లడానికి రాజ్యాంగమే కారణమని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు ప్రజల సంక్షేమం, విద్యా అభివృద్ధికి రాజ్యాంగమే చట్టపరమైన పత్రమని అన్నారు. దేశ పాలన నిర్దేశించే రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి పౌరుడు గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగ రచనకు ఎంతో మంది కృషి చేశారని అన్నారు. ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాతే భారత దేశ రాజ్యాంగాన్ని లిఖించడం జరిగిందని, నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి నిర్ణయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
