- సర్కారుకు ఆదాయం పెంచే అబ్కారి శాఖకు నిధుల కొరత
- ఉమ్మడి జిల్లా అబ్కారి సిబ్బంది ఒక్క రోజు వేతనం విరాళం
- నాలుగేళ్లకు చందాలతో మూడు పిఎస్ ల నిర్మాణం పూర్తి
- నేడు ఎక్సైజ్ మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం
నిజామాబాద్ , బతుకమ్మ: ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖలో ముందు వరుసలో ఉండే శాఖ ఎదైన ఉందంటే అది ఎక్సైజ్ శాఖ పేరును చెబుతారు. సర్కారు ఖజానాను నింపేందుకు కష్టపడి పని చేసే శాఖ అబ్కారి శాఖ. మద్యం అమ్మకాల ద్వార ప్రతి యేటా వేల కోట్లు ఆదాయం అందించేదే ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ. రాష్ర్టంలో మద్య నిషేధం ఎత్తివేసిన తరువాత మద్యం అమ్మకాల విషయంలో అబ్కారి అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి ఎనలేనిది. కాని అలాంటి ఎక్సైజ్ శాఖకు పోలిస్ స్టేషన్ లు అన్ని అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. లక్షల తోనే నిర్మాణం పూర్తి చేసుకునేవాటికి ప్రభుత్వం నిధుల విడుదల చేయడంలో తాత్సరం చేస్తోంది. కొన్ని ప్రాంతాలలో సొంత స్థలాలు లేక అసలు భవనాల ఊసే లేకుండా అద్దె ఇండ్లలో పిఎస్ ల నిర్వహణ అధికారులకు తలకు మించిన భారం అవుతోంది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. అందులో గత ప్రభుత్వ హయంలో ఆర్మూర్, మోర్తాడ్, భీంగల్ పోలీస్ స్టేషన్ లకు స్థలాలను కేటాయించింది. ఆనాడు ఒక్కో పోలీస్ స్టేషన్ జిప్లస్ 1 గా భవన నిర్మాణంకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారు. వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్ లు కేటాయించిన నిధుల వరకే నిర్మాణాలు చేసి మధ్య లోనే వదిలేశారు. దానికి తోడు నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లతో పాటు బోదన్, నిజామాబాద్ డిటిఎఫ్ లకు భవనాలకు స్థలాల ను కేటాయించారు. మూడు అబ్కారి పోలీస్ స్టేషన్ ల నిర్మాణం కొసం నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ లు చేతులెత్తేశారు.
నిజామాబాద్ జిల్లా లో మూడు సంవత్సరాలుగా కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు మొండిగోడలకు పరిమితం అయ్యాయి. దానితో ఎక్సైజ్ అసోసియేషన్ నాయకులు చొరవ తీసుకుని ఉమ్మడి జిల్లాలోని అధికారులు, సిబ్బందితో చర్చించి ఒక్కరోజు వేతనం విరాళంగా ఇచ్చారు. అంతే గాకుండా కొందరు కల్లు మామ్ల ( కల్లు మూస్తేదారులు) నిర్వహకులతో పాటు, మద్యం వ్యాపారులు విరాళాలు ఇవ్వడంతో ఇటీవల భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. గత నాలుగేళ్లుగా మూలన ఉన్న భవనాల నిర్మాణాల పనులు పూర్తి కావడంతో నేడు (సోమవారం) ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ర్టంలో అత్యధికంగా కల్లు తో పాటు, మద్యం క్రయ విక్రయాలలో రెండు లేదా మూడు స్థానాలలో ఇందూర్ జిల్లా ఉంది. అబ్కారి అధికారులు సొంతలాభం కొంతమానుకుని తమకు అన్నం పెడుతున్న పోలీస్ స్టేషన్ నిర్మాణంలో తలో చేయి వేసి నిలిచిపోయిన భవనాల నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా చేసుకోవడంతో ప్రజల నుంచి మన్ననలను అందుకుంటున్నారు .
