నిజామాబాద్, బతుకమ్మ : నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ శివారులో గత నెల 24న హత్యకు గురైన శ్యామల లక్ష్మీ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఏసీపీ వివరాలను వెల్లడించారు. నవీపేట్ మండలం ఫకీరాబాద్ కు చెందిన శ్యామల లక్ష్మీ అలియాస్ బుజ్జీ, గొల్ల సంగీత, కోస్లీ గ్రామానికి చెందిన మంగళి బాబు, మద్దెపల్లికి చెందిన బాదవత్ పద్మ ల మధ్య చాల రోజుల నుంచి పరిచయం ఉంది. ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ అందరూ కలిసి పనిచేసుకునే వారు. కొద్ది రోజుల నుంచి వారి మధ్య డబ్బుల గురించి గొడవలు జరుగుతున్నాయి. దీంతో సంగీత, బాబు, పద్మలు కలిసి శ్యామల లక్ష్మీని చంపాలనే పథకం వేశారు. పథకం ప్రకారం నిర్మానుష్య ప్రదేశానికి కల్లు తాగడానికి తీసుకెళ్లారు. తాగిన తరువాత మత్తులో ఉన్న శ్యామల లక్ష్మీని గొంతు నులిపి హత్య చేసి ముందుగానే తెచ్చిన పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరుసటి రోజు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశారు. కేసును వివిధ కోణాల్లో పరిశోధించి సంగీత, పద్మ, బాబును అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, మాక్లూర్ ఎస్సైఐ రాజశేఖర్, ఏఎస్సై గఫార్, రాజేశ్వర్, నవీపేట్ పీఎస్ సిబ్బందిని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి అభినందించారు.
