నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ బుధవారం పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం ఎప్పటికీ మరువలేము. ఆయన కుటుంబం ఒంటరిగా లేదని, ప్రభుత్వం మరియు ప్రజలు వారితో ఉన్నారని” ధైర్యం చెప్పారు. ధన్‌పాల్ సూర్యనారాయణ వారి కుటుంబానికి ఆర్థికంగా, విద్యాపరంగా సహాయం అందిస్తానని ప్రకటించారు. ప్రమోద్ పిల్లలు పదో తరగతి వరకు చదువుకునే విద్యా ఖర్చులు తానే భరిస్తాను అని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ని రౌడీషీటర్ రియాజ్ దారుణంగా హతమార్చడం తీవ్ర బాధను కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు న్యాలం రాజు, శివ, ఆనంద్ రావు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

