26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కత్తులు కడుపులో పెట్టుకుని తిరుగుతున్నారు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆదాయం కోసం దొంగతనాలు, దందాలు చేస్తున్న రౌడీషీటర్లు
  • కార్డెన్ సెర్చ్ అప్పుడు మాత్రమే ఆయుదాల కోసం సోదాలు
  • కత్తులు లేకుండా బయట తిరుగలేకపోతున్న రౌడీలు

 

నిజామాబాద్, బతుకమ్మ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమైన తర్వాత సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడిషీటర్ కత్తితో పొడిచి చంపడం రాష్ట్రంలో సంచలనం రేపింది. నిజామాబాద్ జిల్లాలోని రౌడిషీటర్లు కత్తులు, కటారులు, తల్వారులు లేకుండా తిరుగడం లేదు. పోలీసు శాఖ కేవలం కార్డెన్ సెర్చ్ అప్పుడు మాత్రమే ఆయుదాలు కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఆర్మ్స్ యాక్టులు నమోదు చేసి చేతులు దులుపేస్తున్నారు. రౌడిషీటర్లు జిల్లాలో దొంగతనాలు, హత్యలు, ఇల్లీగల్ దందాలు చేస్తూ సంపాదించడం, ఎదురు తిరిగిన వారిపై లేదా ప్రశ్నించిన వారిపై కత్తులు దూయడం పరిపాటిగా మారింది. ఏడాది కాలంలోనే పోలీసులపై దాడులు జరుగడం ఏకంగా కానిస్టేబుల్ హత్యకు గురి కావడం నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. కొందరు రౌడిషీటర్లు పోలీసులతో స్నేహం చేసి మరికొందరు దొంగలు కూడా స్టేషన్ లలో కూర్చోండి సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి దాపురించింది. దానితో పోలీసులు రౌడిషీటర్లపై, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే వారు పోలీసు శాఖ పైనే జులం చేస్తున్నారన్న వాదనలున్నాయి. కోర్టు వాయిదాలకు హాజరైన వారు కూడా కత్తులను ఆటోలలో, బైక్ లలో ఉంచి కానీ ఇతరులకు అప్పగించి కానీ కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆటోలలో, బైక్ లలో ఏకంగా నడుముకు కత్తులను (బాడ్) లేకుండా చాలా మంది మైనర్లు కూడా తిరుగుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ బస్టాండ్ వద్ద సమద్ అనే రౌడి షీటర్ ను 5వ టౌన్ ఎస్సై 2024లో హత్యాయత్నం కేసులో అరెస్టు చేసేందుకు రాగా కత్తితో బెదిరించిన ఘటన జరిగింది. గతేడాది మరో రౌడిషీటర్ బర్సత్ ఆమెర్ ను ఆటోనగర్ వద్ద రూరల్ ఎస్సై అరెస్టు చేసేందుకు రాగా కారుతో పోలీసు కారును ఢీకొట్టి పరారీ అయ్యాడు. కత్తులు, కటారులతో ప్రయాణిస్తూ బర్సత్ ఆమెర్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులను చూసి కారును వదిలి పరారీ అయ్యారు. ఇటీవల కాలంలో బోధన్ పట్టణంలోనూ పట్టణ సిఐ పై ఇబ్బు అనే రౌడిషీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. ఏకంగా రౌడిషీటర్ లు పోలీసులనే ఎదురించే విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అటు బోధన్, ఇటు ఆర్మూర్, సిరికొండ వరకు రౌడిలు దొంగల రౌడీయిజం కొనసాగుతుంది. ఒకప్పుడు కలప స్మగ్లర్లుగా, గంజాయి స్మగ్లర్లుగా ఉన్న వారే రౌడిషీటర్లుగా చెలామణి అయ్యారు. కాలానుగుణంగా ఇతర దందాలు చేస్తున్న ప్రధానంగా దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. జిల్లాలో చాలా మంది రౌడిషీటర్లపై దొంగతనాలు, దోపిడిలు, హత్య కేసులు ఉండడమే అందుకు నిదర్శనంగా చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన హత్యల పరంపర ఇప్పటికి కొనసాగుతుంది. తాజాగా 2018లో ధర్మపురి హిల్స్ లో బిహారి గౌస్ అనే రౌడిషిటర్ హత్యకు గురయ్యాడు. తర్వాత కాలంలో 2022లో డిసెంబర్ 1న ఇబ్రహీం చావూస్ ఆలియాస్ జంగల్ ఇబ్బు అనే రౌడిషీటర్ ను ఆరీఫ్ డాన్ అనే రౌడిషీటర్ గ్యాంగ్ హత్య చేసింది 2023 జూన్ 1న రౌడిషీటర్ ఆరీఫ్ డాన్ ను బోధన్ కోర్టుకు పేషీకి హాజరై నిజామాబాద్ కు వస్తుండగా ఎడపల్లి వద్ద లారీతో బైక్ ను ఢీకొట్టించి కత్తులతో పొడిచి అతని సహచరులే హత్య చేశారు. ఆరీఫ్ డాన్ తో ప్రాణభయం ఉండడంతో వారే ఈ హత్య చేశారు. తర్వాత కాలంలో హత్యలు జరుగకపోయినా రెండు గ్యాంగ్ లకు సంబంధించిన వ్యక్తులే పరస్పరం దాడులు, హత్యాప్రయత్నాలకు విఫలయత్నం చేస్తున్నారు. ఇప్పటికి పరారీలో ఉన్న రౌడిషీటర్లు తమ ప్రత్యర్థిని హత్య చేసిన తర్వాతనే లొంగిపోతామనే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 17న హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రౌడిషీటర్  కూడా పరారీలో ఉండడానికి ప్రత్యర్థుల వేటనే కారణమని చర్చించుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో రౌడిషీటర్లు వాడినంతగా సోషల్ మీడియాను ఎవ్వరు వాడడం లేదంటే అతిశయోక్తి కాదు. వారికి అనుచరులుగా, ఫాలోవర్లుగా ఉన్న వారి సంఖ్యను చూస్తే దిమ్మతిరుగుతుంది. డైరెక్ట్ గా ప్రత్యర్థులను పలాన రోజు చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంబంధిత పోస్టులను వారి ఫాలోవర్లు స్టేటస్ లు గా పెట్టుకుని ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో కత్తులను, తల్వార్లను ప్రదర్శించడం రివాజుగా మారింది. బర్త్ డేలకు కత్తులు, తల్వార్ లతోనే బహిరంగంగా కోసే కల్చర్ కొనసాగుతుంది. రౌడిషీటర్లు హత్యలు చేసి హత్యాయత్నం చేసి జైలుకు వెళ్లి విడుదలైతే అతడికి ఘనస్వాగతం పలికి చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐటీ సెల్, సీసీఎస్, టాస్క్  ఫోర్స్, లోకల్ పొలీసులు ఇంత మంది ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో రౌడిషీటర్లు చేస్తున్న పోస్టులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేవు. ఇటీవల కాలంలో ప్రత్యర్థులను బెదిరించేందుకు విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెర్లను వాడుకుని మార్పింగ్ వీడియోలను, బెదిరింపు వీడియోలను పెట్టడం, డబ్బులు వసూల్ చేసి వాటిని డిలీట్ చేసే కల్చర్ జోరుగా సాగుతుంది.

More articles

Latest article