29 C
Hyderabad
Monday, August 3, 2026

దేవదాయ శాఖ పరిధిలోకి తెలంగాణ తిరుమల..?

Must read

📰 Generate e-Paper Clip

  • దేవాలయ నిధుల పక్కదారిపై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే
  • దేవాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం ధర్మకర్తల నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో బీర్కూర్ మాజీ జడ్పీటిసీ ద్రోణవల్లి సతీష్ కు దేవాలయంకు సంబంధించిన రూ.50 లక్షలను ప్రస్తుత ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ సలహాదారు, ఆనాటి మాజీ మంత్రి, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అప్పు నిమిత్తం ఇవ్వడం కలకలం రేపింది. ఇదే విషయాన్ని స్వయంగా మాజీ జడ్పీటిసి సతీష్ అంగీకరించి తనకు ప్రభుత్వం ద్వార కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో కారణంగా వడ్డీతో సహ చెల్లించలేదని తెలిపారు. ఈవ్యవహారం బాన్సువాడ నియోజకవర్గంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ధర్మకర్తలుగా పోచారం కుటుంబం అధికారాన్ని అడ్డుపెట్టుకొని  చేస్తున్న అక్రమాలపై పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తెలంగాణ తిరుమల దేవస్థానంలో దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని, భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జాతీయ రైతు సమాఖ్య తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర రావు దేవదాయ శాఖ రాష్ట్ర ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమల బుధవారం ఈ క్షేత్రాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ క్షేత్రం కు ప్రతినెల ఆదాయ, వ్యయాలు ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో 30 కోట్ల రూపాయలు కేటాయించిన నిధులపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? అవి ఎంతవరకు పూర్తయ్యాయి. వీటిపై సమగ్రంగా దేవదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమల ఆలయ కమిటీ నిర్వాహకులతో చర్చించారు. పూర్తి నివేదికను ఎండోమెంట్ కమిషనర్ కు అందజేస్తామని తెలిపారు.

  • 1950లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం..

ఒక నాటి ఉమ్మడి ఇందూర్  జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆనంద చారీ అనే వ్యక్తి కీలకం. 1950లో నిరుపేద ఆనంద చారి అనే వ్యక్తి కలలో శ్రీవారు శివారులోని కొండపై  దేవాలయాన్ని నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆనంద చారి అతి నిరుపేద అయినప్పటికీ ఆ వైకుంఠ వాసుని కోరిక మేరకు బీర్కూర్, తిమ్మాపూర్ శివారులోని రెండు కొండలపై పది అడుగుల ఎత్తులో సిమెంటు తో ఆ కలియుగ దైవం విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్టాపన చేశారు. ఆలయం నిర్మించడానికి ఆ భక్తుని వద్ద స్తోమత లేక కేవలం తాటి ఆకులతో పందిరి వేశారు. ఆ పందిరి కింద ఉన్న ఈ స్వామివారికి కొంతమంది భక్తులు వెళ్లి పూజలు చేసేవారు. ఈ ఆలయానికి వెళ్లడానికి సరియైన రహదారి లేకపోవడంతో ఓ భక్తుడు నిర్మించిన సగం వరకు నిర్మించిన మెట్లను పై ఆ తర్వాత రాళ్లు రప్పలు దాటుకొని ఈ కలియుగ దైవాన్ని దర్శించుకునేవారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి రూ.50లక్షల రూపాయల వ్యయంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రారంభానికి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు, వేద పండితులు శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ఈ నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ ఆలయానికి తెలంగాణ తిరుమల దేవస్థానం గా చిన్న జీయర్ స్వామి నామకరణం చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి విడుదల వారీగా రూ.30కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించారు. ఈ ఆలయ అభివృద్ధికి రెవెన్యూ శాఖ 66ఎకరాల భూమిని కేటాయించింది.

  • దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటారా..?

ప్రస్తుతం దేవాదాయ శాఖ విచారణ నేపథ్యంలో బీర్కూర్ లోని తెలంగాణ తిరుమల భవితవ్యం ఎమిటనేది త్వరలో తేలిపోనుంది. తెలంగాణ తిరుమల పేరిట జరిగిన నిర్మాణం తరువాత దానిపై రాజకీయం మొదలవ్వడమే కారణం. బాన్సువాడ నియోజకవర్గంలో అతిపెద్ద దేవాలయం వివాదాలకు కేంద్ర బింధువు కావడంతో ఈ వ్యవహారం పోచారం కుటుంబానికి తీరని అప్రతిష్టను మూటగట్టుకుంది. ప్రధానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన తరువాత జరుగుతున్న పరిణామాలు, ఉప ఎన్నికల ఉహగానాలను తెలంగాణ తిరుమల ఆలయం వివాదాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు ఈ ఉదంతాన్ని రాజకీయం చేస్తుండటం ఫిర్యాదులు, దేవాదాయ శాఖ విచారణ తో ఆలయ పాలన ధర్మకర్తల నుంచి దేవదాయ శాఖకు చేరుతుందా లేక  విచారణ అటకెక్కుతుందా వేచి చూడాలి.

More articles

Latest article