28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు

Must read

📰 Generate e-Paper Clip

  • బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశంలో కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ : బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ తో  కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ఈ పథకం కింద ఎంత మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు, ప్రస్తుతం ఎంతమంది కొనసాగుతున్నారు, వివిధ కారణాల వల్ల యాజమాన్యాలు విద్యార్థులు ఎవరినైనా బడి నుండి బలవంతంగా బయటకు పంపించారా అని కలెక్టర్ ఆరా తీశారు. బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగస్వాములైన ఆయా ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులు, ఇబ్బందుల గురించి కూడా కలెక్టర్ యాజమాన్యాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఏ ఒక్క విద్యార్ధికి సైతం ఇబ్బంది కలుగకుండా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం యాజమాన్యాలు తమవంతు తోడ్పాటును అందజేయాలని హితవు పలికారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, బెస్ట్ అవైలబుల్ స్కీం అమలవుతున్న పాఠశాలలు కూడా పిల్లలకు విద్యను నేర్పించడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠ్యాంశాల బోధన,  వసతుల కల్పన విషయంలో బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులు పట్ల వివక్షను ప్రదర్శించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుల విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వసతుల కల్పనకు చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, సంక్షేమ శాఖల అధికారులు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం అమలవుతున్న పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.

Students should not be put in trouble

More articles

Latest article