29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

“సుప్రీం” టు హైకోర్ట్..

Must read

📰 Generate e-Paper Clip

  • తెగని రిజర్వేషన్ల “పంచాయితీ”
  • హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారన్న ధర్మాసనం
  • మరో రెండు రోజులు రిజర్వేషన్ల పై ఉత్కంఠ

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీ) 42% రిజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2025 అక్టోబర్ 6న కొట్టివేసింది. ఒకపక్క తెలంగాణ హైకోర్టులో ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఈ కేసుపై తుది తీర్పు వెలువడక ముందే ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 23% నుంచి 42%కి పెంచుతూ జీఓ 9 జారీ చేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్లు ఈ నిర్ణయం సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘిస్తుందని, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయని వాదించారు.

  • హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచన..

పిటిషనర్లు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే అంశంపై హైకోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున, నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించి కేసు కొట్టివేసింది. అయితే తగిన ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు సుప్రీంకోర్టు కల్పించింది. దీంతో ఎల్లుండి వరకు రిజర్వేషన్ల వ్యవహారంపై ఉత్కంఠత కొనసాగనుండగా, సుప్రీంకోర్టులో తుది తీర్పు వస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురయింది. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశం మరో రెండు రోజులు తెగని “పంచాయతీ” గా మిగిలిపోనుంది.

More articles

Latest article