- ప్రారంభం నుంచి ఇంచార్జీ సూపరింటెండెంట్ ల పాలనకే పరిమితం
- షాడో ల పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అస్థవ్యస్థం
- ఇష్టం లేదంటునే పోస్టింగ్ కోసం వెంపర్లాట
- ఏడంతస్థుల మేడలో పేదలకు దక్కని పేద్దసార్ల వైద్యం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్)లకు రెగ్యూలర్ సూపరింటెండెంట్ నియామకం కలగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి రాగా 2013 నుంచి అడ్మిషన్ లు జరిగాయి. అప్పటి వరకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా ఉన్న హాస్పిటల్ ను ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) గా మార్చారు అనాటి పాలకులు (కాంగ్రెస్ ప్రభుత్వం). అయితే అప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో అతి పెద్ద జిల్లా ఆసుపత్రికి సూపరింటెండెంట్ లుగా చాల మంది వైద్యులు పనిచేశారు. ఆనాడు పేరుకే 250 పడకల ఆసుపత్రిలోను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు, నాందేడ్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా రోగులకు అత్యుత్తమ సేవలు అందాయి. కాని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గా ఏడు అంతస్థుల మేడ లో 750 పడకలలో పేదలకు వైద్యం అందని ధ్రాక్షగా మారింది. ఎందుకంటే గత పుష్కర కాలంగా (12 సంవత్సరాలుగా) ఇంచార్జీ సూపరింటెండెంట్ ల పాలనలో మగ్గడమే కారణం. 2025 జూన్ 8న రాష్ట్రంలో చివరగా బోధన్ ఆసుపత్రుల అనుబంధ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కు సూపరింటెండెంట్ ల నియామకం జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు మెడికల్ కళాశాలలకు, ఆసుపత్రులకు రెగ్యూలర్ సూపరింటెండెంట్ ల నియామకం జరిగింది. నిజామాబాద్ జిజిహెచ్ కు ఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ ప్రోఫెసర్ డా.క్రిష్ణా మాలకొండ రెడ్డిని నియమించగా ఆయన విధులలో చేరలేదు. దానితో జిజిహెచ్ మళ్లీ ఇంచార్జీ ల పాలనకే పరిమితమైంది.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మొదటి ఇంచార్జీ సూపరింటెండెంట్ గా డాక్టర్ భీంసింగ్ వ్యవహరించగా ఆనాటి నుంచి వరుసగా డాక్టర్ రాజేంధ్ర ప్రసాద్, రమాదేవి, నరేంద్రకుమార్, రాములు, నాగేశ్వర్ రావు, ధీన్ ధయాల్ బంగ్, ప్రతి మారాజ్ ల తరువాత డాక్టర్ శ్రీనివాస్ ఇంచార్జీ లుగా పనిచేశారు. కోవిడ్ కష్టకాలంలో పనిచేసిన ప్రతిమారాజ్ కాలంలో వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడాగానే విధుల నుంచి తప్పించారు. అప్పటికే సీనియర్ గా ఉన్న శ్రీనివాస్ సీనియర్ గా ఉండగా ఆయనను ఇంచార్జీగా నియమించారు. నిజామాబాద్ జిజిహెచ్ పరిస్థితి ఎలా ఉందంటే సీనియర్ లకు సొంత ప్రాక్టిస్ ముఖ్యం. ఏ మాత్రం సమయం దొరికిన హైద్రాబాద్ లో ప్రత్యక్ష మౌతుంటారు. ఇక జూనియర్ లకు ఆసుపత్రి పాలన అంటే పరమ ప్రీతి. ఎందుకంటే వారే ఇక్కడ షాడో సూపరింటెండెంట్ లుగా చలామణి అవుతున్నారు. జిజిహెచ్ లో పేరుకే ప్రొఫెసర్ లు, అసోసియేట్, అసిస్టేంట్ ప్రొఫెసర్ లుగా చలామణి అవుతున్న వారు హైద్రాబాద్ నుంచి రాకపోకలు చేస్తున్నారు. సీనియర్ ల తరువాత ఉన్న జూనియర్ లు తామే ఇంచార్జీలకు షాడోలుగా వ్యవహరిస్తు పాలన వ్యవహరాల్లో తలదూర్చుతున్నారు. వారు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎస్ఆర్ ల మొదలుకొని సియంఓలను, పీజీ విద్యార్థులను తమ ప్రైవేట్ ప్రాక్టీస్ లో పనిచేయిస్తున్నారు. నిజామాబాద్ జిజిహెచ్ సూపరింటెండెంట్ పదవి అంటే ఏమాత్రం ఇష్టం లేదని కలరింగ్ ఇస్తున్న వారు పోస్టింగ్ ల కోసం వెంపర్లాడుతున్నారు. జిజిహెచ్ పాలన అస్థవ్యస్థంకు కారణం పాలకులే అనే ఆరోపణలు లేకపోలేదు.
నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 21 డిపార్ట్ మెంట్ లు ఉన్నాయి. అక్కడ 750 పడకల ఆసుపత్రిలో పాటు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నాయి. సీజనల్ లో ప్రతి నిత్యం ఔట్ పెషేంట్ లు 1500 వరకు వస్తారు. అలాంటి జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ లు, జూనియర్ రెసిడెంట్ లు (సియంఓలు), సినియర్ రెసిడేంట్ లు 160 మంది పనిచేస్తున్నారు. పీజీ మూడు సంవత్సరాల విద్యార్థులు 130 మంది చదువుతున్నారు. హౌజ్ సర్జన్ లు 120 మంది ఉన్నారు. అంతమంది వైద్యుల సేవలు అందితే మూడు వందల మందికి ఒక్కసారి 300 మంది వైద్యలు సేవ చేయవచ్చును. కాని జిజిహేచ్ ల ఇంచార్జీ పాలన అస్థవ్యస్థంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో చివరి సారిగా పాలక మండలి సమావేశం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా పాలకులు లేరు పాలక మండలి సమావేశం ఊసు లేదు. దానితో ఇంచార్జీ పాలనను ఎవరూ ఖాతరు చేయడం లేదు. పేరుకు బయో మెట్రిక్ అటెండెన్స్ ఉన్న, ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థ ఉన్న సీనియర్ లు వారానికి ఒకటి, రెండు రోజులకు మించి ఆసుపత్రి ముఖం చూడటం లేదు. పైపెచ్చు సీనియర్ లమని బెదిరింపులు, అందరికి ప్రైవేట్ ప్రాక్టీస్ లు ఉన్నాయని హుంకరింపులు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో ఎక్కువగా బెదిరిస్తే మీ బండారం బయట పెడుతామని బెదిరింపులు ఉన్నాయి. ఇంచార్జీ పాలనను ఖాతరు చేయని సీనియర్ లు, జూనియర్ లు పీజీ, హౌస్ సర్జన్ ల పై ఆధారపడి నడిపిస్తున్నారు. దానితో ఆదివారం వెతికిన ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ లు కనిపించరు. మిగిలిన రోజులలో కేవలం హాజరు కు మాత్రమే. సెక్షన్ డ్యూటీ, క్లాస్ ల బోదన పేరిట విధులకు డుమ్మాకొడుతున్నారు. దానితో ఏడంతస్థుల మేడలో పేదలకు నిఖార్సైన సర్కారు వైద్యం (అనుభవం కలిగిన వైధ్యుల) అందడం లేదు. ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పాలకులు నజర్ వేయాల్సిన పరిస్థితి ఉంది.
