27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ కార్డుదారులకు షాక్

Must read

📰 Generate e-Paper Clip

  • ఈ యేడాది మహిళలకు బతుకమ్మ కానుకలు మహిళా సంఘాల గ్రూప్ లకేనా?

 

నిజామాబాద్, బతుకమ్మ : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. అయితే ఈసారి రేషన్ కార్డు ఉన్న మహిళలకు పంపిణీ చేయకుండా కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో చీర రూ.800 ఉండగా రెండేసి చీరలు చొప్పున రూ.1600 వరకు మహిళలకు కానుకగా ఇవ్వనుంది ప్రభుత్వం. ముఖ్యంగా పల్లెటూర్లలో, పట్టణాలు, వార్డులలో అనేక మహిళలు రేషన్ కార్డు ఆధారంగా గతంలో చీరలు పొందారు. ఆ చీరలు నాసిరకంగా ఉన్నప్పటికీ చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం తమను పక్కనపెట్టడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల జాబితాలో లేని గృహిణులు, పేద కుటుంబాల వారు ప్రభుత్వాన్ని తమకూ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత యేడాది సైతం బతుకమ్మ చీరలు పంపిణీ చేయకపోవడం ఈ యేడాది స్వయం సహాయ సంఘాల సభ్యులకే చీరలు పంపిణీ  చేయడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేము కూడా పేదవారిమేనని, రేషన్ కార్డు ఆధారంగా ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నారని కానీ బతుకమ్మ చీరల్లో మాత్రం తేడా ఎందుకు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇందిరా మహిళా శక్తిపేరుతో మహిళా సంఘాలకే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సిరిసిల్లాలో తయారయిన చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో పంపిణీ కూడా ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే యాదాద్రి, సూర్యాపేట వంటి జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి మున్సిపాలిటీలు,మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక దృశ్యం కనిపించింది. బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని ట్రాన్స్ జెండర్ సమాజానికి కానుకలు అందించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 20 మంది ట్రాన్స్ జెండర్లకు చీరలు పంపిణీ చేశారు.

More articles

Latest article