- జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. వినాయకులను నిమజ్జనం చేసిన ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు, నందిపేట మండలం ఉమ్మెడ, నవీపేట్ మండలం యంచ గోదావరి బ్రిడ్జి తదితర ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి, వినాయక విగ్రహాల నిమజ్జనం తీరుతెన్నులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఏ చిన్న ప్రమాదానికి సైతం ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాలలో ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు, బోట్లు, మెడికల్ టీంలు, క్రేన్ సదుపాయాలు, లైటింగ్, అంబులెన్స్ తదితర వసతులను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన విధులను పక్కాగా నిర్వహిస్తూ, నిమజనోత్సవం ప్రశాంతంగా ముగిసేలా చూడాలని అధికారులకు హితవు పలికారు.
కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి, మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు, కలెక్టర్, సీ.పీ లకు స్వాగతం పలికారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు సైతం కలెక్టర్ తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు జెండా ఊపి శోభాయాత్ర రథాన్ని ప్రారంభించారు. అందంగా అలంకరించిన సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విఘ్నేశ్వరుని కృపతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు.
గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. భారీ విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేసే యంచ, ఉమ్మెడతో పాటు అన్ని మండల కేంద్రాలలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. నిమజ్జోనోత్సవం సాఫీగా సాగేలా పర్యవేక్షించేందుకు సెక్టోరల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సరిపడా సంఖ్యలో క్రేన్లు, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పని చేస్తున్నాయని, బారికేడ్లు, విద్యుత్ దీపాలు వంటి వసతులు నెలకొల్పామన్నారు. నిమజ్జన శోభాయాత్రను కలెక్టరేట్ తో పాటు సీ.పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కాగా, శోభాయాత్ర సందర్భంగా సుమారు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

