హైదరాబాద్, బతుకమ్మ : మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని జాగృతి నాయకులు ఖండించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాగృతి అధ్యక్షురాలు కవిత వల్లే రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారన్నారు. రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అన్నం పెట్టిన చేతినే నరికేస్తున్నారు.. కవితపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు సైతం దిగుతామని హెచ్చరించారు. ఇకపైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రాజీవ్ సాగర్, మఠం బిక్షపతిల మాటల వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారన్నారు. జాగృతి ద్వారా నష్టపోయిన రాజీవ్ సాగర్ ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎట్లా నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న జాగృతి అధ్యక్షురాలు కవితపై వ్యాఖ్యలు చేస్తే మీరు ఎక్కడికి పోయారన్నారు. తెలంగాణ జాగృతి మాది అంటున రాజీవ్ సాగర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి రాజీవ్ సాగర్ ఈరోజు కోట్లకు పడగలెత్తారని తెలిపారు. జాగృతి కార్యకర్తలు కవితను కలుస్తామంటే కలవనీయకుండా అడ్డుకున్న వ్యక్తి రాజీవ్ సాగర్ నేడు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజీవ్ సాగర్ కు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కవిత ప్రయత్నించారని తెలిపారు.

