- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల అసంపూర్తి పనులు, ఇతర పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికే సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. అర్బన్ ఏరియాలలో పెండింగ్‌లో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల సదుపాయాల కల్పన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. మంజూరీ తెలుపబడిన లబ్ధిదారులు అందరూ తక్షణమే మార్కింగ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టేలా చొరవ చూపాలని అన్నారు. లబ్దిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్ల భవనాల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖ వారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
